WTC Final: దేశంలో టెస్ట్‌లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..!

Team India Fans Not Satisfied On Inclusion Of Ishan Kishan For WTC Final  - Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం గాయపడిన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ ప్లేయర్‌గా ముద్రపడిన ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసినందుకు గాను భారత క్రికెట్‌ అభిమానులు సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశంలో టెస్ట్‌ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారంటూ ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు.

సెలెక్టర్లకు భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ గెలవాలని లేనట్లుంది, అందుకే టీ20 ఆడుకునే వాడిని జట్టులో చేర్చుకున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకవేళ మేనేజ్‌మెంట్‌ ఇషాన్‌ను తుది జట్టులోకి (డబ్ల్యూటీసీ ఫైనల్‌) తీసుకుంటే, చాలాకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోతుందని అంటున్నారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇషాన్‌ గణాంకాలు (48 మ్యాచ్‌ల్లో 38 సగటున 2985 పరుగులు) చూసే ఈ ఎంపిక చేశారా.. లేక ఎవరైనా రెకమెండ్‌ చేస్తే జట్టులోకి తీసుకున్నారా అంటూ సెలెక్టర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇషాన్‌ కంటే వెయ్యి రెట్టు మెరుగైన గణాంకాలు కలిగి, దేశవాలీ టోర్నీల్లో పరుగుల పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ (37 మ్యాచ్‌ల్లో 79.65 సగటున 3505 పరుగులు) కానీ, టెస్ట్‌ ఫార్మాట్‌కు అతికినట్లు సరిపోయి, ప్రస్తుతం (ఐపీఎల్‌ 2023) సూపర్‌ ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్‌ సాహా కానీ సెలెక్టర్లకు కనపడలేదా అని నిలదీస్తున్నారు.  సర్ఫరాజ్‌కు అనుభవం లేదని వదిలేస్తే, సాహా గత రంజీ ట్రోఫీ ప్రదర్శననైనా (7 ఇన్నింగ్స్‌ల్లో 52.16 సగటున 313 పరుగులు) పరిగణలోకి తీసుకొని ఉండాల్సిందని అంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగే ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు ఇషాన్‌ కంటే సాహా బెటర్‌గా సూటవుతాడని, ఇషాన్‌ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పే చేశారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో టెస్ట్‌ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాళ్లే లేరని స్టాండ్‌ బై ప్లేయర్‌గా సూర్యకుమార్‌ను, వరల్డ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌ లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారంటూ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.

చదవండి: రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు బంపరాఫర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top