‘హోం’లో పోరుకు రెడీ! | Sunrisers match in Uppal today | Sakshi
Sakshi News home page

‘హోం’లో పోరుకు రెడీ!

Apr 5 2026 4:19 AM | Updated on Apr 5 2026 11:06 AM

Sunrisers match in Uppal today

నేడు ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఢీ  

మ.గం.3:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2026 సీజన్‌లో హైదరాబాద్‌ వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ మైదానంలో నేడు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. 

తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడినా... ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి రైజర్స్‌ జోరు మీదుంది. మరో వైపు లక్నో తాము ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమిపాలైంది. 2025 సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది.  

మార్పుల్లేకుండా... 
తిరుగులేని బ్యాటింగ్‌ బలగం ఉన్న సన్‌రైజర్స్‌ మరోసారి అదే విధ్వంసక ఆటను సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్, అభిషేక్‌ మెరుపు బ్యాటింగ్‌లో చెలరేగితే జట్టుకు తిరుగుండదు. హైదరాబాద్‌ ఓపెనర్లను లక్నో ఏమాత్రం నిలువరించగలదనేదే ఆసక్తికరం. వీరి తర్వాత అదే ధాటిని కొనసాగించేందుకు ఇషాన్‌ కిషన్, క్లాసెన్‌ సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనా...అనికేత్‌ వర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్‌. వీరికి తోడు లోకల్‌ బాయ్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. 

కోల్‌కతాలో పోరులో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన నితీశ్‌ తన జోరును కొనసాగించాలని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడో స్థానంలో వచ్చే సలీల్‌ కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. అన్నింటికి మించి హైదరాబాద్‌ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా అనుకూలమే. పరుగుల విషయంలో ఎన్నో రికార్డులు ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్‌ బ్యాటింగ్‌ ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. 

అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే సహజంగానే రైజర్స్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. డేవిడ్‌ పేన్‌ ప్రధాన పేసర్‌ కావడం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా...ఉనాద్కట్, మలింగ, దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశం.  
పంత్‌పై తీవ్ర ఒత్తిడి... 
గత సీజన్‌లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకొని మళ్లీ దారిలో పడటం టీమ్‌కు ఎంతో కీలకం. ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు కాబట్టి ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా మరో ప్రయత్నం చేయవచ్చు. 

మార్‌‡్ష, మార్క్‌రమ్‌ తమ స్థాయికి తగినట్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. రెండు అగ్రశ్రేణి జట్ల టి20 కెపె్టన్లు అయిన వీరిద్దరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. పూరన్‌ ఐదో స్థాయిలో బరిలోకి దిగడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బదోని కంటే ముందు నాలుగో స్థానం అతను ఆడే అవకాశం ఉంది. 

గత మ్యాచ్‌లో ఆదుకున్న సమద్‌ తమ మాజీ జట్టుపై మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. లక్నో పేస్‌ దళం చాలా పటిష్టంగా ఉంది. షమీ, మొహసిన్, నోర్జే, ప్రిన్స్‌ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్‌ లేని లోటును టీమ్‌ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

స్వదేశానికి కమిన్స్‌ 
సన్‌రైజర్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ ఆ్రస్టేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను దానికి స్కానింగ్‌ చేయించుకునేందుకు స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే ఐపీఎల్‌ రెండో దశ పోటీల్లో ఆడతాడా లేదా తేలుతుందని ఆసీస్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

చెన్నై X బెంగళూరు 
సా.7:30నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం 
బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో తమ విజయపరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బెంగళూురు తలపడుతుంది. 

సీజన్‌ తొలి పోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి అమితోత్సాహంతో మొదలు పెట్టిన ఆర్‌సీబీ సొంత గ్రౌండ్‌లో అభిమానులకు మళ్లీ గెలుపు సంబరం అందించాలని భావిస్తోంది. మరో వైపు వరుసగా రెండు పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సీఎస్‌కే తడబడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement