
నేడు ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్‌లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్‌ఆర్‌హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది.
ఈ సీజన్‌లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్‌ఆర్‌హెచ్‌ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్‌లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.
మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్‌లో ఆడిన తొలి 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి!
టాపార్డర్ రాణిస్తేనే...
గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్‌లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు.
ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్‌లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది.
కెప్టెన్ కమిన్స్‌తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్‌కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్‌పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం.
‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై
ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది.
రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్‌కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్‌తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు.
సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
తుదిజట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.
10 సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది.