‘బౌలర్ల‌కు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’ | Sunil Gavaskar Bold Idea For IPL Send Stunning Message To BCCI | Sakshi
Sakshi News home page

బౌలర్ల‌కు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి: గావస్కర్‌

May 12 2026 4:23 PM | Updated on May 12 2026 5:02 PM

Sunil Gavaskar Bold Idea For IPL Send Stunning Message To BCCI

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)పై భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గావ‌స్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్ల‌కు స‌మాన అవ‌కాశాలు రావాలంటే బౌల‌ర్లు నాలుగు ఓవ‌ర్ల‌కు ప‌రిమితం కాకుండా ఐదు ఓవ‌ర్లు వేసేలా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించాల‌ని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివ‌ల్ల జ‌ట్టులోని బెస్ట్ బౌల‌ర్ సేవ‌ల‌ను మ‌రింత‌గా ఉప‌యోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.

మిడ్‌-డే కాల‌మ్‌లో గావ‌స్క‌ర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. 

జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్‌లో బౌలర్‌ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్ల‌కు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవ‌కాశ‌మున్న‌ప్ప‌టికీ, ఒక అదనపు ఓవర్‌ను వేయించ‌డం ద్వారా ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవ‌కాశ‌మున్న‌ప్పుడు, బౌల‌ర్‌కు మాత్రం ఒక ఓవ‌ర్ ఎక్కువ‌గా వేసేందుకు ఎందుకు అనుమ‌తించకూడదన్నది నా ప్రశ్న.

ఈ మేర‌కు నిబంధ‌న‌లు సవ‌రించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల  ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జ‌ట్టులో ముగ్గురు బెస్ట్ బౌల‌ర్లు ఉన్న‌ప్పుడు వారితో త‌లా ఐదు ఓవ‌ర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్‌లో రాసుకొచ్చారు. 

ఈ నిబంధ‌న‌ను ఐపీఎల్‌లో ప్రయత్నించ‌డానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావ‌స్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. టీ20 ఫార్మాట్ అయిన‌ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్ర‌య‌త్నిచ‌డం ద్వారా ఫ‌లితాలు చూడ‌వ‌చ్చ‌న్నారు. వ‌చ్చే సీజ‌న్ లేదా ఐపీఎల్ 2028 సీజ‌న్ నుంచి ఈ నిబంధ‌న‌ను ఉప‌యోగిస్తే చూడాల‌ని ఉందని గావ‌స్క‌ర్ తెలిపారు.

చదవండి: పాక్‌ బౌలర్‌ ప్ర‌పంచ రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement