పతకాలు ‘గంగ’పాలు కాలేదు! 

Stopped by farmer leader from immersing medals - Sakshi

మనసు మార్చుకున్న రెజ్లర్లు 

హైడ్రామా నడుమ వెనుదిరిగిన వైనం 

హరిద్వార్‌: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు.  సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్‌లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది.  మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్‌ చేరుకున్నారు. ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్‌ పూనియా... ప్రపంచ చాంపియన్‌షి ప్‌లో పతకం సాధించిన వినేశ్‌ ఫొగాట్, సంగీత, వీరి  బంధుమిత్రులు, అభిమానులు హర్‌ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు.

రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top