ముంబైతో తలపడనున్న ఢిల్లీ
మధ్యాహ్నం గం. 3:30 నుంచి గుజరాత్‌తో రాజస్తాన్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్‌లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.
గుజరాత్ బోణీ చేసేనా!
తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది.


