భారత్‌ లేకుండా టోర్నీ.. పాక్‌ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం | Sri Lanka Cricket Takes Massive Step On Pakistan's Request For New Tournament Without India | Sakshi
Sakshi News home page

భారత్‌ లేకుండా టోర్నీ.. పాక్‌ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం

May 6 2026 6:10 PM | Updated on May 6 2026 6:28 PM

Sri Lanka Cricket Takes Massive Step On Pakistan's Request For New Tournament Without India

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్‌తో వన్డే ట్రై సిరీస్‌ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం​ పాక్‌తో క్రికెట్‌ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. 

పాక్‌ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్‌ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్‌ చేసుకున్నట్లు పాక్‌ క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్‌  దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, పాక్‌లో ట్రై సిరీస్‌ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్‌ జరుగనుంది. ట్రై సిరీస్‌ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్‌ సిరీస్‌ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న పాక్‌
రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్‌ మే 16 నుంచి సిల్హెట్‌ వేదికగా జరుగనుంది.

బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్‌ అలీ, సల్మాన​ అఘా, సౌద్‌ షకీల్‌, షాహీన్‌ అఫ్రిది

Advertisement
 
Advertisement
Advertisement