
జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 31) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బెన్ కర్రన్ (95 బంతుల్లో 79; 9 ఫోర్లు), సికందర్ రజా (55 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు తీయగా.. అషిత ఫెర్నాండో 2, దిల్షన్ మధుష్క, జనిత్ లియనాగే చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) అద్భుతమైన శతకంతో కదంతొక్కినా, చివరి ఓవర్‌లో విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది.
నిస్సంకకు జతగా కెప్టెన్ అసలంక (61 బంతుల్లో 71; 7 ఫోర్లు) కూడా రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఈవాన్స్ తలో 2 వికెట్లు తీయగా.. ముసుకు ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ సిరీస్‌లో తొలి వన్డేలోనూ జింబాబ్వే గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకు పోరాడినా ఆ జట్టుకు ఓటమైతే తప్పలేదు. ఈ సిరీస్‌లో ఓడినా జింబాబ్వేకు మంచి మార్కులే పడ్డాయి. తమకంటే మెరుగైన శ్రీలంకపై జింబాబ్వే అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటింది.
తొలి వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.
ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో హరారే వేదికగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక ఆసియా కప్ ఆడేందుకు నేరుగా యూఏఈకి వెళ్లనుంది.