
ఆరేళ్ల తర్వాత పదవిలోకి వచ్చిన మాజీ కెప్టెన్
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సోమవారం జరిగిన ‘క్యాబ్’ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో గంగూలీని ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నారు.
కాగా 2015–2019 మధ్య ఇదే పదవిలో ఉన్న ఉన్న సౌరవ్ (Sourav Ganguly)... ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ అవే బాధ్యతలు చేపట్టడం విశేషం. 2019–2022 మధ్య ‘దాదా’ బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు.
ఇక ఈడెన్ గార్డెన్స్‌ను ఆధునీకరిస్తూ సామర్థ్యాన్ని లక్షకు పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లను నిర్వహించేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా గంగూలీ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టుకు ఈడెన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
9 ఎకరాల్లో..
వచ్చే టీ20 వరల్డ్ కప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో కోల్‌కతాకు కీలక మ్యాచ్‌లు దక్కేలా బీసీసీఐతో మాట్లాడి తన ప్రయత్నం చేస్తానని కూడా అతను వెల్లడించాడు. ‘బెంగాల్ టీమ్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్లో ఆడింది. ఇప్పుడు టీమ్ మరింత బలంగా మార్చడమే నా మొదటి లక్ష్యం.
ఇందులో మరో మాటకు తావు లేదు. క్రికెట్ తర్వాతే మిగతా అంశాలు వస్తాయి. 9 ఎకరాల్లో అత్యంత ఆధునిక అకాడమీని నిర్మిస్తాం. దీని కోసం ఇప్పటికే భూమిని తీసుకున్నాం. ప్లానింగ్ కూడా పూర్తయింది’ అని సౌరవ్ తన ప్రణాళికలు వివరించాడు.
చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్‌ట్రాలు