
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. 2015–2019 మధ్యకాలంలో తొలిసారి ఈ పదవిని నిర్వహించిన ఆయన.. ఇప్పుడు రెండోసారి క్యాబ్ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
తన అన్న స్నేహాశిష్ గంగూలీ స్థానాన్ని సౌరవ్ భర్తీ చేయనున్నారు. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదవి కొసం ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యలేదు. ఇతరులెవ్వరైనా నామినేషన్లు వేసి ఉంటే అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్ 22న జరిగేది.
గంగూలీ ప్యానెల్‌లో నితీష్ రంజన్ దత్తా ఉపాధ్యక్షుడిగా, బబ్లు కోలే కార్యదర్శిగా, మదన్‌మోహన్ ఘోష్ సహాయ కార్యదర్శిగా, సంజయ్ దాస్ ట్రెజరర్‌గా ఉంటారు.
రెండో సారి క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గంగూలీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరోసారి క్యాబ్ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్యాబ్ ఓ కుటుంబం లాంటిది. ఇక్కడ ఎలాంటి ప్రతిబంధకాలు లేవు.
త్వరలో ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. అలాగే టీ20 వరల్డ్‌కప్, బెంగాల్ ప్రో టీ20 లీగ్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాను. మిగతా సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాను.
ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా మరోసారి ఎన్నికవుతారని టాక్ నడుస్తుంది. క్యాబ్ గంగూలీని తమ ప్రతినిధిగా ఏజీఎంకు నామినేట్ చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. ఏజీఎంకు నామినేట్ కావడం వల్ల గంగూలీ బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంటాడు.
గంగూలీ 2019-2022 మధ్యలో బీసీసీఐ బాస్‌గా వ్యవహరించాడు. తాజా మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ దిగిపోవడంతో సెప్టెంబర్ 28న ఎన్నిక జరుగనుంది. ఈ పదవికి సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నామినేషన్లు వేస్తారు.