
2 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరగ్గా, ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతోంది. వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-0 క్లీన్ స్వీప్ చేసినప్పటికీ జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో గట్టి పోటీనిచ్చింది.
అదే పోరాటాన్ని జింబాబ్వే టీ20 సిరీస్‌లోనూ కొనసాగిస్తుంది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్‌లో 175 పరుగులు చేసి, ఆతర్వాత చివరి ఓవర్ వరకు ఆ స్కోర్‌ను కాపాడుకోగలిగింది.
వన్డే సిరీస్ తరహాలోనే శ్రీలంక తొలి టీ20లోనూ గెలుపు కోసం చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్లు మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క ఓవర్ దెబ్బకొట్టింది. మపోసా వేసిన 18వ ఓవర్‌లో కమిందు మెండిస్ 26 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ శ్రీలంక చేతుల్లోకి వచ్చేసింది.
అప్పటివరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. ఆ ఒక్క ఓవరే జింబాబ్వే చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఆతర్వాత కమిందు.. హేమంత సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (16 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆడిన కమిందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకుముందు బ్రియాన్ బెన్నెట్ (57 బంతుల్లో 81; 12 ఫోర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్నెట్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
కెప్టెన్ సికందర్ రజా (28), ర్యాన్ బర్ల్ (17), తషింగ ముసేకివా (11) రెండంకెల స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు పడగొట్టగా.. తుషార, తీక్షణ, హేమంత తలో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (55), కుసాల్ మెండిస్ (38) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి లంక గెలుపుకు గట్టి పునాది వేశారు. అయితే వీరిద్దరు ఔట్ కాగానే శ్రీలంక ఇరకాటంలో పడింది. స్వల్ప వ్యవధిలో మరో 4 వికెట్లు కోల్పోయింది.
ఒత్తిడిలో కమిందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి లంకను గెలిపించాడు. ఆ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 2, ముజరబానీ, మపోసా, బ్రాడ్ ఈవాన్స్, సికందర్ రజా తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది.