
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్‌లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు.
విరాట్ 2020 నుంచి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్‌లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్‌తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్‌లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్‌లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.
వర్క్ లోడ్ కారణంగా మేనేజ్‌మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్‌మెంట్ సిరాజ్‌ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్‌కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్‌ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది.
సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్‌లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.
సిరాజ్ త్వరలో తన కెరీర్‌లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్‌ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్‌లో ప్రభావం చూపలేకపోయాడు.
మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్‌మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి.