అన్నింటికంటే అదే గొప్ప విజయం.. ఇంకేం అవసరం లేదు!

Shuttler HS Prannoy Says Thomas Cup Gold Is Enough No Regrets - Sakshi

దాదాపు ఐదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయం అందుకోలేకపోయిన భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తనకు ఎలాంటి విచారం లేదని వ్యాఖ్యానించాడు. ఒక దశలో లీ చోంగ్‌ వీ, లిన్‌ డాన్, చెన్‌ లాంగ్, అక్సెల్సన్‌లను ఓడించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరాడు ప్రణయ్‌.

కానీ.. ఈ కేరళ షట్లర్‌ ఇంతవరకు మాస్టర్స్‌ స్థాయి టోర్నీని గెలవలేకపోయాడు. అయితే తన కెరీర్‌లో థామస్‌ కప్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో భాగం కావడమే గొప్ప క్షణమని, వ్యక్తిగత విజయాలు దక్కకపోయినా తాను బాధపడనని అతను అన్నాడు. కాగా 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌లో ఈ ఏడాది తొలిసారి భారత్‌ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్‌... తెలంగాణ ప్లేయర్‌ పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్, కోచ్‌ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.

గెలుపు వీరులు
థామస్‌ కప్‌లో భారత్‌ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (కేరళ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)... ఎం.ఆర్‌.అర్జున్‌ (కేరళ)–ధ్రువ్‌ కపిల (పంజాబ్‌) జోడీలు బరిలోకి దిగాయి.

చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top