Shahid Afridi And Shaheen Afridi: ఎంతైనా కాబోయే అల్లుడు.. అందుకే ఒప్పుకున్నాడు

Shaheen Shah Afridi Emotional Coming With Shahid Afridi Jersey No 10 - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది జెర్సీ నెంబర్‌ 10 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు దశాబ్దాలు పాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అఫ్రిది మంచి ఆల్‌రౌండర్‌గా.. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా.. పవర్‌ హిట్టర్‌గా పేరు పొందాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది గుడ్‌బై చెప్పాడు.  తాజాగా అఫ్రిది ధరించిన జెర్సీ నెంబర్‌ను ఇకపై తాను ధరించనున్నట్లు పాక్‌ యువ ఆటగాడు షాహిన్‌ అఫ్రిది ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు.  

పాక్‌ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న షాహిన్‌ అఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లు కలిపి 77 మ్యాచ్‌లాడిన షాహిన్‌ మొత్తంగా 177 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా షాహిన్‌ తన ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ''10వ నెంబర్‌ జెర్సీ' అనేది నాకు ఒక నెంబర్‌ కన్నా ఎక్కువ. ఆ జెర్సీ నెంబర్‌ నిజాయితీ, సమగ్రతో పాటు పాక్‌ క్రికెట్‌పై ప్రేమను కలిగేలా చేసింది. మామ షర్ట్‌తో ఇకపై మ్యాచ్‌లు ఆడనున్నాను.. అది దేశం తరపున'' అంటూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ!


కాగా షాహిన్‌ ట్వీట్‌పై షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. '' నేను ఈ జెర్సీని ఎంతో గౌరవంగా చూసుకున్నా. 10వ నెంబర్‌ నా జీవితంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆ జెర్సీ నీ చేతికి వచ్చింది. నా నమ్మకాన్ని నిలబెడతావని అనుకుంటున్నా. నీ కెరీర్‌ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ తెలిపాడు. అయితే అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు.

''ఒకరి జెర్సీ నెంబర్‌ మరొకరికి ఇవ్వాలంటే కుదరకపోవచ్చు.. కానీ ఎంతైనా కాబోయే అ‍ల్లుడు కదా.. అందుకే ఒప్పుకున్నాడు'' అంటూ కామెంట్లు పెట్టారు. కాగా షాహిద్‌ అఫ్రిది కూతురు, షాహిన్‌ అఫ్రిదికి వివాహం జరగనుందని కొద్ది కాలం కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని.. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం.

ఇక పాకిస్తాన్‌ జట్టు త్వరలోనే న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు ముందు మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టి20 ల సిరీస్‌ జరగనుంది.

చదవండి: T20 World Cup 2021: షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌లకు నో చాన్స్‌;  పాక్‌ టీ20 జట్టు ఇదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top