Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్థశతకాలతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు.
వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించిన ఆటలో జైస్వాల్ 32 బంతుల్లోనే 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లోనే జైస్వాల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్ కెరీర్‌లో యశస్వి జైస్వాల్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో, 2021లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్‌సెంచరీలు సాధించాడు.
ఇక రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు సాధించాడు. 19 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్ అజింక్యా రహానేతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో బట్లర్, సంజూ శాంసన్‌లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డులకెక్కాడు. వంద సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్‌కు 69 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. జైస్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌లు), రిషబ్ పంత్ (68 ఇన్నింగ్స్‌లు), శివమ్ దూబే (59 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌లాడిన జైస్వాల్ ఖాతాలో రెండు సెంచరీలు, 17 అర్థసెంచరీలున్నాయి. కాగా ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు షేన్ వాట్సన్ (109), బట్లర్ (135), శాంసన్ (192) ఉన్నారు.
Guwahati still needs an umbrella! ☔️6️⃣🔥 pic.twitter.com/2oCGPHyP7O
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2026


