
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. హరియాణా స్టీలర్స్‌తో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–33 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 12 పాయింట్లు సాధించగా, యోగేశ్ 6 పాయింట్లు సాధించాడు. హరియాణా ఆటగాళ్లలో శివమ్ పటారే 7, మయాంక్ సైనీ 6 పాయింట్లతో రాణించారు.
మరోవైపు మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. మూడు పరాజయాల తర్వాత ఆ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పుణేరి పల్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 48–37 పాయింట్ల తేడాతో నెగ్గింది. పైరేట్స్ రెయిడర్ అయాన్ లోచబ్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అయాన్ ఒక్కడే 21 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధ భాగంలోనే అయాన్ ‘సూపర్ 10’ సహా ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా 27–10 తేడాతో ముందంజలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో సమష్టితత్వంతో కోలుకున్న పుణేరి పదునైన ఆటతో చెలరేగినా భారీ వ్యత్యాసాన్ని తగ్గించలేకపోయింది. పైరేట్స్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసి రెండో అర్ధభాగంలో 27–21తో పైచేయి సాధించినా తుది ఫలితంలో మాత్రం 11 పాయింట్ల తేడాతో నిరాశ తప్పలేదు. పుణేరి తరఫున సచిన్ 6, అభిషేక్ గున్‌గే 5 పాయింట్లు నమోదు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లలో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్...గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.