
బెంగళూరు బుల్స్‌కు రెండో పరాజయం
విశాఖ స్పోర్ట్స్: మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 41–34తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. కెప్టెన్ అశు మలిక్ (15 పాయింట్లు) ముందుండి జట్టును గెలిపించాడు. రెయిడింగ్‌లో అదరగొట్టాడు. 23 సార్లు కూతకెళ్లిన కెప్టెన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మరో రెయిడర్ నీరజ్ నర్వాల్ (7) ఆకట్టుకున్నాడు. వీరిద్దరి శ్రమకు ఊతమిచ్చేలా... డిఫెండర్లు సౌరభ్ నందల్ (3), ఫజల్ అత్రాచలి (3), సుర్జీత్ సింగ్ (3) సమష్టిగా రాణించారు.
ప్రత్యర్థి రెయిడర్లను అద్భుతంగా టాకిల్ చేశారు. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయిన్ (10), రెయిడర్ ఆశిష్ మలిక్ (8) మెరుగ్గా ఆడారు. అయితే సహచరుల నుంచి సరైన సహకారం లేక బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. విశాఖ అంచెలో బెంగళూరు బుల్స్ ఇంకా బోణీ కొట్టలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్ 39–36తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. జైపూర్ రెయిడర్లు నితిన్ కుమార్ (13), అలీ చౌబ్తరష్ (8) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చారు.
పట్నా జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ (15), సుధాకర్ (9), అయాన్ (6) అద్భుతంగా రాణించినప్పటికీ డిఫెండర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. పైరేట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడతాయి. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం మూడు జట్లు పుణేరి పల్టన్, యూపీ యోధాస్, యు ముంబా జట్లు నాలుగు పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాయి.