
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో ఓటమిపై సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో ఆద్యంతం ఒకే రకమైన దూకుడును కనబర్చలేకపోయామని... నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రత్యర్థి జోడీకి సులువుగా పాయింట్లు ఇచ్చామని... పురుషుల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట వివరించింది. ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 67 నిమిషాల్లో 19–21, 21–18, 12–21తో చెన్ బో యాంగ్–లియు యి (చైనా) జంట చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సాత్విక్–చిరాగ్ జోడీకిది రెండో పతకం కావడం విశేషం. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఈ జంట కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ‘సెమీఫైనల్లో శుభారంభం లభించలేదు. ఒక లయను దొరకబుచ్చుకోలేకపోయాం. మూడో గేమ్‌లో సులువుగా పాయింట్లు ఇచ్చేశాం. కీలకదశలో కాస్త చాకచక్యంగా ఆడాల్సింది. అయితే చైనా జోడీ అద్భుతంగా ఆడింది. మూడు గేముల్లోనూ ఆ జంట సర్వీస్ బాగా చేసింది’ అని చిరాగ్ వ్యాఖ్యానించాడు.
‘చైనా జోడీ పూర్తి విశ్వాసంతో ఆడింది. ఆరంభ మ్యాచ్‌ల్లో మేము ఇలాగే ఆడాం. చైనా ఆటగాళ్లు మ్యాచ్‌ను ఆద్యంతం ఆస్వాదించారు. తొలి గేమ్‌లో మేము 12–7తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ చైనా ద్వయం ఆందోళన చెందకుండా సహజశైలిలో ఆడి మాపై ఒత్తిడి పెంచింది. మ్యాచ్‌లో అడపాదడపా మేము మెరిపించాం. కీలక మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కూడా ముఖ్యం’ అని సాత్విక్ తెలిపాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో షి యుకి (చైనా), మహిళల సింగిల్స్‌లో అకానె యామగుచి (జపాన్) విజేతలుగా నిలిచారు.