చాంపియన్‌ రుత్విక–రోహన్‌ | Ruthvika Shivani wins India International Challenge Badminton Tournament title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ రుత్విక–రోహన్‌

Nov 18 2024 4:07 AM | Updated on Nov 18 2024 4:07 AM

Ruthvika Shivani wins India International Challenge Badminton Tournament title

ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌ కైవసం 

రాయ్‌పూర్‌: సీఎం ట్రోఫీ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్‌ గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ జంట అదరగొట్టింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్‌ ట్రోఫీలో దక్కడం విశేషం. 

గత వారం హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలోనూ ఐదు విభాగాల్లో భారత ఆటగాళ్లకే విన్నర్స్, రన్నరప్‌ ట్రోఫీలు లభించాయి. తెలంగాణ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచిన రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ జంట... తాజా టోర్నీ ఫైనల్లో ఆదివారం 21–16, 19–21, 21–12తో టాప్‌ సీడ్‌ అమృత ప్రముథేశ్‌–అశిత్‌ సూర్య ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ రక్షిత శ్రీ సంతోష్‌ రామ్‌రాజ్‌ కైవసం చేసుకుంది. 

తుదిపోరులో రక్షిత 17–21, 21–12, 21–12తో క్వాలిఫయర్‌ తన్వి పత్రిపై గెలుపొందింది. తొలి గేమ్‌ కోల్పోయిన రక్షిత ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో విజృంభించి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి విజేతగా నిలిచింది. గత వారం హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రక్షిత ఈ సారి టైటిల్‌ చేజిక్కించుకుంటే... 13 ఏళ్ల తన్వి పత్రి ఆడిన తొలి సీనియర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకోవడం విశేషం. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ మిథున్‌ మంజునాథ్‌ టైటిల్‌ హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో మిథున్‌ 13–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రాహుల్‌ భరద్వాజ్‌ గాయంతో తప్పుకున్నాడు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో హరిహరణ్‌ అంసాకరుణన్‌–రూబన్‌ కుమార్‌ జంట 21–15–21–16తో డింకూ సింగ్‌–అమాన్‌ మొహమ్మద్‌ ద్వయంపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో ఆరతి సారా సునీల్‌–వర్షిణి విశ్వనాథ్‌ శ్రీ జోడీ 21–18, 21–19తో కావ్య గుప్తా–రాధిక శర్మ జంటపై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement