IND Vs SL: బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్‌ శర్మ.. ఏమన్నాడంటే?

Rohit Sharma reacts to Jasprit Bumrahs absence from the ODI series - Sakshi

స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు పర్యాటక జట్టుతో భారత్‌ ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే సిరీస్‌కు ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

లంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోక పోవడంతో ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక​గాయం కారణంగా బుమ్రా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని తొలుత లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించాడని భావించిన సెలక్టర్లు అతడిని లంకతో వన్డే జట్టులోకి చేర్చారు.

కానీ అతడికి ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్యబృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం కావడంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. బుమ్రా వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని రోహిత్‌ తెలిపాడు.

"వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం కావడం చాలా  దురదృష్టకరం. అతడు ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే కొన్ని రోజులు కిందట అతడు తన వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిందని భావించాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐ మెడికల్‌ టీంకు కూడా సమాచారం ఇచ్చాడు.

కానీ మళ్లీ ఇప్పుడు బుమ్రా తన వెన్ను నొప్పి మొదలైందని తెలియజేశాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని వన్డే జట్టు నుంచి తప్పించింది. అతడు మా ప్రధాన బౌలర్‌. కాబట్టి అతడి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని భావించాం" అని తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: 'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top