జట్టు కోసం ఎక్కడైనా ఆడతా

Rohit Sharma happy to bat anywhere but not sure opener role will change - Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌ స్థానంపై రోహిత్‌ శర్మ వ్యాఖ్య

న్యూఢిల్లీ: జట్టు అవసరాలకి అనుగుణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని భారత స్టార్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో గాయం నుంచి కోలుకుంటోన్న రోహిత్‌... తాను టీమిండియాతో కలిసే సమయానికల్లా జట్టులో తన బ్యాటింగ్‌ స్థానం ఖరారు అవుతుందని పేర్కొన్నాడు. ‘గతంలో ఎన్నోసార్లు చెప్పిందే మళ్లీ చెప్తున్నా. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయమంటే అక్కడ సంతోషంగా ఆడతా.

ఓపెనర్‌గా నా స్థానాన్ని మారుస్తారో? లేదో? నాకు తెలియదు. విరాట్‌ కోహ్లి భారత్‌కు వచ్చేశాక ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనే అంశంపై ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న మా జట్టు ఓ అంచనాకు వచ్చిందని అనుకుంటున్నా. అక్కడికి వెళ్లాకే నాకూ నా స్థానంపై స్పష్టత వస్తుంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ... సంప్రదాయ క్రికెట్‌లో రాణించేందుకు ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు.

ఆస్ట్రేలియా పిచ్‌లపై పెద్దగా బౌన్స్‌ ఉండదని వ్యాఖ్యానించాడు. ‘2018 పర్యటనలో ఎంతమంది భారత బ్యాట్స్‌మెన్‌ బౌన్సర్లకు అవుటయ్యారు? పెర్త్‌ మినహా అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో బౌన్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ కొత్త బంతితో స్టార్క్, కమిన్స్, హాజెల్‌వుడ్‌ బౌన్స్, స్వింగ్‌ చేసేందుకే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎక్కువ బంతులు నేరుగా బ్యాట్‌పైకి వచ్చే అవకాశముంది. ఈ ఫార్మాట్‌లో రాణించాలంటే ప్రాథమిక అంశాలే కీలకం. అందుకే వాటిపైనే దృష్టి సారించా. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. వాటి నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.   

మరో నాలుగైదు రోజుల్లోనే...
ఇషాంత్, రోహిత్‌ ఆస్ట్రేలియా రావాలన్న టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి  
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే భారత సీనియర్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితులు మారిపోతాయని అన్నారు. క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా భారత్‌ నుంచి బయల్దేరాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘రోహిత్, ఇషాంత్‌ టెస్టు సిరీస్‌ ఆడాలంటే మరో నాలుగు లేదా ఐదు రోజుల్లోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కాలి. లేనిపక్షంలో వారికి  ఇబ్బందిగా మారుతుంది. క్వారంటైన్‌ కారణంగా వారిద్దరు డిసెంబర్‌ 6–8 వరకు జరిగే తొలి వార్మప్‌ మ్యాచ్‌కు దూరం కానున్నారు. ఇంకా ఆలస్యమైతే రెండో వార్మప్‌ మ్యాచ్‌ (డిసెంబర్‌ 11–13)కు కూడా దూర మయ్యే అవకాశముంది. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనైనా వారిద్దరూ ఆడాల్సి ఉంటుంది. బీసీసీఐ వీలైనంత త్వర గా వారిని ఆస్ట్రేలియా పంపించాలి’ అని రవిశాస్త్రి సూచించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top