‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’ | Rohit Gets Key Captaincy Appointment Role Hardik To Quit MI: Report | Sakshi
Sakshi News home page

‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’

May 29 2026 3:48 PM | Updated on May 29 2026 3:52 PM

Rohit Gets Key Captaincy Appointment Role Hardik To Quit MI: Report

మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్‌-2026లో గ్రూప్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఐదుసార్లు చాంపియన్‌
కాగా రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించింది.

ఘోర పరాభవం
ముంబై ఇండియన్స్‌ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్‌ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్‌పై నెగిటివిటీ కాస్త తగ్గింది.

గతేడాది ప్లే ఆఫ్స్‌ చేరినా..  
అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్‌ చేర్చాడు హార్దిక్‌ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్‌.. 10 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్‌ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.

ముంబై తప్పు తెలుసుకుంది
‘‘ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్‌ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్‌ తదుపరి కెప్టెన్‌ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్‌ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్‌ స్క్రీన్‌పై ‘07:07’ టైమ్‌ను షేర్‌ చేయడంతో.. అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.

మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతింటే
ఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్‌ కచ్చితంగా ట్రాన్స్‌ఫర్‌ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.

ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దైతే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement