అన్నలా చెప్తున్నా.. బహిరంగంగా ఇలా చేయొద్దు: అశ్విన్‌ | Riyan Parag vaping row: R Ashwin sympathises Says action was needed | Sakshi
Sakshi News home page

అన్నలా చెప్తున్నా.. బహిరంగంగా ఇలా చేయొద్దు: అశ్విన్‌

May 2 2026 12:32 PM | Updated on May 2 2026 12:59 PM

Riyan Parag vaping row: R Ashwin sympathises Says action was needed

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో ‘వేపింగ్‌’ (ఇ- సిగరెట్‌తో పొగ పీల్చడం) చేయడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతడిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. అయితే, అయితే మరీ కఠినంగా వ్యవహరించకుండా స్వల్ప స్థాయి శిక్షతో సరి పెట్టింది. 

జరిమానాతో సరి
పరాగ్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా అతని ఖాతాలో వేసింది. క్రికెట్‌ గౌరవాన్ని తగ్గించే ఘటనగా పేర్కొంటూ పరాగ్‌కు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఐపీఎల్‌ నియమావళిలో ఆర్టికల్‌ 2.21ను పరాగ్‌ ఉల్లంఘించాడు. ఇది క్రికెట్‌ను అగౌరవపర్చే చర్య. తన తప్పును అంగీకరిస్తూ పరాగ్‌ శిక్షకు సిద్ధమయ్యాడు’ అని బోర్డు పేర్కొంది. 

జట్టుపైనా చర్యలు
అయితే ఇలాంటి చర్యకు అవకాశం కల్పించిన రాజస్తాన్‌ రాయల్స్‌ టీమ్‌పై కూడా చర్య తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందని కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు. ‘ఐపీఎల్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆటగాళ్లు, అధికారులతో పాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా ఉంది. ఈ నేపథ్యంలో సదరు టీమ్‌పై కఠిన చర్య తీసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. 
   
దురదృష్టకర ఘటన
ఈ ఘటనపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా స్పందించాడు. వేపింగ్‌ చేస్తూ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) పట్టుబడటాన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించాడు. పరాగ్‌ అలా చేయాల్సింది కాదని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. 

యువ ఆటగాళ్లు తమ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని అతను సూచించాడు. ‘ఇది అన్ని విధాలుగా నివారించి ఉండాల్సిన ఘటన. ఇలాంటి విషయాల్లో పడరాదని యువ ఆటగాళ్లకు చెబుతున్నా.

అన్నలాగా సలహా ఇస్తున్నా
ఇది వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయమే. కానీ ఇవి వ్యక్తిగతంగానే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరైంది కాదు. ఒక అన్నలాగా పరాగ్‌కు నేను సలహా ఇస్తున్నా. నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక ఐపీఎల్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఇలా చేయవద్దు. 

చాలా మంది యువ ఆటగాళ్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి మరింత బాధ్యతగా మెలగడం అవసరం. ఈ రోజుల్లో దేనినీ దాచలేం. కాబట్టి మున్ముందు తప్పునుంచి నేర్చుకోవాలంటే తగిన శిక్ష వేయడం కూడా అవసరం. పరాగ్‌ విషయంలో అదే జరిగింది’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

రూ. 25 లక్షలు చెల్లించే అవకాశం
కాగా మంగళవారం న్యూ చండీగఢ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా పరాగ్‌ ఘటన చోటు చేసుకుంది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని ‘వేపింగ్‌’ చేస్తున్నట్లుగా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. 

ఐపీఎల్‌ 19వ సీజన్‌ కోసం రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు రూ. 14 కోట్లకు పరాగ్‌ను రీటెయిన్‌ చేసుకుంది. మ్యాచ్‌కు రూ. 1 కోటి చొప్పున అతడికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి.. జరిమానా రూపంలో పరాగ్‌ రూ. 25 లక్షలు చెల్లించే అవకాశముంది. 

చదవండి: అస్సలు పట్టించుకోను.. వారితో​ నాకేంటి: రియాన్‌ పరాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement