పంత్‌ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో!

Rishabh Pant Leading The Race For Test Captaincy Of Team India - Sakshi

భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే రెగ్యులర్‌ కీపర్‌గా మారిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చాడు రిషభ్‌ పంత్‌. తన అరంగేట్రం ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత రిషభ్‌లో వేడి తగ్గింది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ నిరాశపరుస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాడు. మళ్లీ పంత్‌ తనేమిటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కీలక సమయాల్లో ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడి తాను విలువైన ఆటగాడిననే విషయాన్ని నిరూపించుకుంటాడు పంత్‌. ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పరువునష్టం దావా.. ఏకంగా 32 కోట్లకు..!

అభిమానులకే డైలమా?
రిషభ్‌ పంత్‌.. పడి లేచిన కెరటం మాదిరి జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగానే సాగుతున్నాడు. జట్టులో నిలకడగా ఎంతవరకూ ఆడుతున్నాడో అనే విషయంలో అభిమానులకు డైలమా ఉన్నా ఏదొక సమయంలో ఆడతాడు అనే నమ్మకం మాత్రం ఉంది.  అది ఎ‍ప్పుడు ఆడతాడనే విషయం అతనికే కాదు.. ఎవ్వరికీ తెలియదు. 

రాహుల్‌ రిప్లేస్‌ చేశాడు..!
వికెట్‌ కీపర్‌గా పంత్‌ స్థానాన్ని రిప్లేస్‌ చేసేందుకు టెస్టుల్లో సాహా ఉండగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌లు అందుబాటులో ఉన్నారు. 2019-2020 సీజన్‌లో కివీస్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్‌ గాయపడటంతో రాహుల్‌ కీపర్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో శాంసన్‌కు బ్యాకప్‌ కీపర్‌గా తీసుకున్నారు. కానీ రాహుల్‌కే కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడంతో శాంసన్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

పంత్‌ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు!
పంత్‌ గాయం నుంచి కోలుకున్నా రిజర్వ్‌ బెంచ్‌ నుంచే మ్యాచ్‌లు చూస్తుండిపోయాడు. ఇలా సుదీర్ఘ కాలంగా రాహుల్‌ మెరుగ్గా కీపింగ్‌ చేయడంతో పంత్‌ గురించి పట్టించుకోనేలేదు. ఒకానొక దశలో  టీమిండియా జట్టులోకి పంత్‌ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా అనే అనుమానం కూడా వచ్చింది. పంత్‌ ఒక టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు..అతని ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా అనే మాట కూడా అన్నారు. అసలు పంత్‌ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇచ్చారు. 

సెంచరీతో శభాష్‌ అనిపించాడు
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ ఒక్క సెంచరీతో శభాష్‌ అనిపించాడు. మూడు టెస్టుల సిరీస్‌లకు గాను ఐదు ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా చివరి ఇన్నింగ్స్‌(మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో) సెంచరీ బాదేశాడు. అంతే మళ్లీ పంత్‌ పేరు మార్మోగింది. అదే సిరీస్‌లో పంత్‌ వరుసగా ఫెయిల్‌ కావడంతో తప్పించండి అనే వాళ్లకి సెంచరీతో సమాధానం చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు అందరూ విఫలమైన చోట పంత్‌ రాణించడంతో టాలెంట్‌ గురించి ప్రస్తావన రాక తప్పలేదు. భారత క్రికెట్‌ జట్టు పరువు పోయే స్థితిని దాటించాడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఆ సెంచరీనే పంత్‌ను మరొక స్థానం కట్టబెట్టటానికి దోహదపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదనేది వారి మనోభావం.

కెప్టెన్సీ రేసులో పంత్‌!
ఇటీవల టెస్టు కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లికి గుడ్‌ బై చెప్పడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని పూడ్చే పనిలో పడింది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోల్పోయిన మరుక్షణమే తన కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు చెప్పడంతో ఇక్కడ బీసీసీఐ గేమ్‌ ప్లాన్‌ కూడా ఉండవచ్చని సగటు అభిమాని మదిలో మాట. ఏది ఏమైనా కోహ్లి టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతని టీమిండియా కెప్టెన్సీ కథ ముగిసిపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే విషయంలో మొదటగా వినిపించిన పేరు రిషబ్‌ పంత్‌ది. అసలు జట్టులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నుంచి కెప్టెన్సీ రేసు వరకూ వచ్చాడు పంత్‌. 

సఫారీలతో సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో పంత్‌ ఆడని పక్షంలో అతని స్థానంపై కచ్చితంగా మళ్లీ సందిగ్థత ఏర్పడేది. కానీ శతకంతో ఒక్కసారిగా కెప్టెన్సీ రేసుకొచ్చేశాడు పంత్‌. దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కూడా పంత్‌నే టెస్టు కెప్టెన్‌గా చేస్తే బాగుంటుదనే సలహా కూడా ఇచ్చేశాడు. కేఎల్‌ రాహుల్‌ నుంచి పోటీ ఉన్నా ఇక్కడ పంత్‌కే తొలి ప్రయారిటీగా కనబడుతోంది. ఏది ఏమైనా మెల్లగా జట్టులో పాతుకుపోతున్న పంత్‌.. టీమిండియా టెస్టు కెప్టెన్‌ అయినా పెద్దగా ఆశ్చర్య పోకుండా, అదృష్టం అంటే ఇట్టానే ఉంటుందేమో అనుకోకతప్పదు. 

ఐపీఎల్‌లో కూడా అంతేగా..!
గత ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథ్య బాధ్యతలు తీసుకున్న పంత్‌.. రెగ్యులర్‌ కెప్టెన్‌ అయిపోయాడు. అప్పటివరకూ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని ఢిల్లీని ఎ‍క్కువ చూసిన అభిమానగణం.. ఆ తర్వాత పంత్‌ కెప్టెన్సీ సూపర్‌ అంటూ మురిసిపోయారు. రెండు దశల్లో జరిగిన గత ఐపీఎల్‌ సీజన్‌లో అయ్యర్‌ను మలిదశలో కెప్టెన్‌గా చేద్దామనుకున్నా అతనికి భంగపాటు ఎదురైంది. పంత్‌కే మళ్లీ పగ్గాలు అప్పచెప్పింది ఢిల్లీ క్యాపిటల్స్‌. ఆపై అయ్యర్‌ను ఢిల్లీ మొత్తంగా వదిలేసుకోవడంతో పంత్‌ కెప్టెన్సీపై నమ్మకానికి ప్రతీకగా మారింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top