Photo Courtesy: IPL 2026
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (సీఎస్‌కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్‌కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది.
ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పట్టికలో సీఎస్‌కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్‌కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.
గతంలో సీఎస్‌కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్‌కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది.
అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్‌కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది.
రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.
కెప్టెన్‌గా రుతురాజ్ విఫలం..
2024 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్‌కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్‌లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్‌లో మాత్రం అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు.
వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు.
కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

సంజూకు ఏమైంది?
రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్‌కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్‌లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్‌కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు.
మిడిలార్డర్‌లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.
పసలేని బౌలింగ్..
బ్యాటింగ్‌లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్‌లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్‌కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.
అదంతా గతం..

ఇక కెప్టెన్‌గా సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్‌కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్‌లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం.
ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్‌కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్‌కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.


