‘అహం’ వదిలి మైదానానికి వస్తా! | Ravindra Jadeja expressed satisfaction with his all round performance | Sakshi
Sakshi News home page

‘అహం’ వదిలి మైదానానికి వస్తా!

Apr 24 2026 2:51 AM | Updated on Apr 24 2026 2:51 AM

Ravindra Jadeja expressed satisfaction with his all round performance

రవీంద్ర జడేజా వ్యాఖ్య 

తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనపై సంతృప్తి  

లక్నో: భారత క్రికెటర్, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రభావవంతమైన ప్రదర్శన కనబర్చాడు. అటు బ్యాటింగ్‌లో మెరుగైన స్కోరు సాధించిన అతను, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను నిలువరించి రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత కొన్ని మ్యాచ్‌లలో జడేజా బౌలర్‌గా తన పూర్తి స్థాయి నాలుగు ఓవర్ల కోటా కూడా వేయలేదు. దీనిపై అతను స్పందించాడు. జట్టు కోణంలోనే అంతా ఆలోచించాలని, ఏ రూపంలోనైనా టీమ్‌కు ఉపయోగపడటమే తన పని అని అతను వ్యాఖ్యానించాడు. 

‘నేను మైదానానికి వస్తున్నప్పుడే నా అహాన్ని హోటల్‌ రూంలో వదిలి బయలుదేరతాను. ఆ రోజు టీమ్‌కు ఎలా ఉపయోగపడగలనో అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప మిగతా విషయాలు కాదు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ విషయానికి వస్తే చివరి వరకు నిలబడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. ఎందుకంటే 17 లేదా 18వ ఓవర్లో అవుటైపోతే మేం 159 వరకు చేరేవాళ్లం కాదు. కనీసం 20–25 పరుగులు తగ్గేవి. అప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించడం లక్నోకు సులువయ్యేది. టి20 మ్యాచ్‌లలో ప్రతీ పిచ్, పరిస్థితులు భిన్నంగా ఉండాయి కాబట్టి దానికి తగినట్లుగా ఆడాలి. 

బౌలింగ్‌లో ఫలానా ప్రత్యర్థి బ్యాటర్‌ నా బౌలింగ్‌ను సులువుగా ఆడతాడని జట్టు భావిస్తే అర్థం చేసుకోగలను. అది జరిగినా, జరగకపోయినా ఆటలో భాగంగానే భావిస్తాను’ అని జడేజా చెప్పాడు. చివరి ఓవర్‌ మయాంక్‌ యాదవ్‌ వేస్తాడని ముందే ఊహించి దానికి తగినట్లుగా సిద్ధమయ్యానన్న జడేజా ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. బౌలింగ్‌లో వేగాన్ని సమర్థంగా వాడుకునే మార్‌‡్ష, పూరన్‌లకు స్లో బంతులు వేసి కట్టడి చేయగలిగినట్లు జడేజా వివరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement