
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ 26 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు నెలకొల్పి, ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. 10 ఏళ్ల కెరీర్‌లో ప్రపంచవాప్తంగా దాదాపు అన్ని టోర్నీల్లో సత్తా చాటి తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు.
అయితే రషీద్ ఒక్క టోర్నీలో మాత్రం తనపై ఉన్న హైప్‌కు న్యాయం చేయలేకపోయాడు. ఆ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్. ఈ టోర్నీలో రషీద్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఇది అంత తీసి పారేసే ప్రదర్శనేమీ కానప్పటికీ.. రషీద్ స్థాయి అయితే కాదు.
త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో (టీ20) రషీద్ తన మార్కు చూపించాలని తహతహలాడుతున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఖండాంతర టోర్నీలో మరో 3 వికెట్లు తీస్తే.. ఈ టోర్నీలోని అత్యుత్తమ రికార్డు రషీద్ ఖాతాలో పడుతుంది.
ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ ఈ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 5.34 ఎకానమీ చొప్పున పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు.
ఈ రికార్డుకు సంబంధించి ప్రస్తుతం రషీద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రషీద్‌కు ముందు భువీకి మధ్యలో యూఏఈ బౌలర్లు అంజద్ జావెద్ (7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు), మొహమ్మద్ నవీద్ (7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) ఉన్నారు.
రషీద్ ఖాన్‌తో పాటు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచేందుకు రషీద్‌తో పాటు హార్దిక్ పాండ్యాకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం రషీద్ షార్జాలో జరుగుతున్న యూఏఈ ట్రై సిరీస్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. యూఏఈ ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్, యూఏఈతో పాటు పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది.
ఇంతకీ ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఎన్ని సార్లు జరిగింది..?
కాగా, ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు రెండు సార్లు జరిగింది. త్వరలో జరుగబోయేది మూడో ఎడిషన్ అవుతుంది. 2016లో ఈ ఖండాంతర టోర్నీని తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో (బంగ్లాదేశ్) నిర్వహించారు. ఆతర్వాత 2022లో రెండో సారి జరిగింది (యూఏఈలో). తొలి ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరుగబోయే ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగనుంది.