Ranji Trophy 2022-23: శతక్కొట్టిన పడిక్కల్‌

Ranji Trophy 2022 23: Devdutt Padikkal Slams Ton Vs Jharkhand - Sakshi

Devdutt Padikkal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాడు, రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (175 బంతుల్లో 114; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌.. కే గౌతమ్‌ (4/61), శ్రేయస్‌ గోపాల్‌ (3/18), కావేరప్ప (2/34), శుభంగ్‌ హేగ్డే (1/16) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్ణాటక.. పడిక్కల్‌ సెంచరీ, వికెట్‌కీపర్‌ శరత్‌ (60) అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో 300 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్‌ బౌలర్లలో షాబాజ్‌ నదీమ్‌ 5 వికెట్లతో చెలరేగగా.. అనుకుల్‌ రాయ్‌ 3, వినాయక్‌ విక్రమ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 146 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జార్ఖండ్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

కుమార్‌ (20), ఆర్యమాన్‌ సేన్‌ (0) ఔట్‌ కాగా.. కుమార్‌ సూరజ్‌ (34), కుమార్‌ కుషాగ్రా (24) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌ కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక ఇదివరకే క్వార్టర్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. 

కాగా, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున సంచలన ఇన్నింగ్స్‌లతో పడిక్కల్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020లో ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్‌.. ఆ సీజన్‌లో 473 పరుగులు, ఆతర్వాతి సీజన్లలో వరుసగా 411, 376 పరుగులు చేశాడు. గతేడాదే పడిక్కల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు శతకాలు బాదిన పడిక్కల్‌.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top