
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దులీప్ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో రజత్‌తో పాటు మరో సెంట్రల్ జోన్ ఆటగాడు కూడా సెంచరీ చేశాడు. వన్ డౌన్‌లో బరిలోకి దిగిన దనిశ్ మలేవార్ 171 బంతుల్లో 25 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మలేవార్‌కు జతగా రజత్ పాటిదార్ 111 పరుగుల వద్ద (85 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.
టీ విరామం సమయానికి సెంట్రల్ జోన్ స్కోర్ వికెట్ నష్టానికి 314 పరుగులుగా (61 ఓవర్లలో) ఉంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-బిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి సెంట్రల్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నార్త్ ఈస్ట్ జోన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.
ఓపెనర్ ఆయుశ్ పాండే 3 పరుగులకే ఔటయ్యాడు. ఆకాశ్ చౌదరీ బౌలింగ్‌లో హేమ్ ఛెత్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆయుశ్ పాండే ఔటయ్యాక సెంట్రల్ జోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. మరో ఓపెనర్ ఆర్యన్ జుయల్ 60 పరుగుల వద్ద అనుకోకుండా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం బరిలోకి దిగిన రజత్ పాటిదార్ టీ20లకు తలపిస్తూ షాట్లు ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో మలేవార్ కూడా వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సెంట్రల్ జోన్‌ను ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంచారు. ఈ మ్యాచ్ గెలిస్తే సెంట్రల్ జోన్ సెమీస్‌కు చేరుతుంది.