ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే! | Rajasthan Royals Batter Vaibhav Sooryavanshi Fears SRH Bowlers IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే!

Apr 13 2026 4:46 PM | Updated on Apr 13 2026 5:03 PM

Rajasthan Royals Batter Vaibhav Sooryavanshi Fears SRH Bowlers IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ భీక‌ర ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ‌రిలోకి దిగిందే మొద‌లు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్‌రేట్‌తో 200 ప‌రుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొన‌సాగుతున్నాడు. 

తాను క్రీజులో ఉంటే బౌల‌ర్ ఎవ‌రైతే నాకేంటి.. బంతిపైనే త‌న దృష్టి ఉంటుంద‌ని ఇటీవ‌లే ఆర్సీబీతో మ్యాచ్ అనంత‌రం డైరెక్ట్ స్టేట్‌మెంట్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌స్తాన్ ఆడిన ప్ర‌తీ జ‌ట్టులో ఒక ప్ర‌ధాన బౌల‌ర్‌ను వైభ‌వ్ ఒక ఆట ఆడుకున్నాడు.  

చెన్నైతో మ్యాచ్‌లో మాట్ హెన్రీని, గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ర‌బాడను, ముంబైతో మ్యాచ్‌లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. ఇక ఇవాళ వైభ‌వ్ సూర్యవంశీ ఎస్ఆర్‌హెచ్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్‌వుడ్‌, ర‌బాడ వంటి టాప్ బౌల‌ర్ల‌ను ఉతికారేసిన వైభ‌వ్ ముందు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చిన్న‌బోతోంది. 

క‌మిన్స్ లేక‌పోవ‌డంతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బ‌ల‌హీనంగా త‌యార‌య్యింది. ఒక్కరు కూడా చెప్పుకోద‌గ్గ బౌల‌ర్ లేకపోవ‌డం మైన‌స్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు దారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. యావ‌రేజ్‌గా చూసుకుంటే ప్ర‌తీ ఓవ‌ర్‌కు 10.42 ప‌రుగులివ్వ‌డం గ‌మ‌నార్హం. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బౌలింగ్ ప‌రంగా అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఎస్ఆర్‌హెచ్‌దే. ఇక పేస‌ర్ల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా కనిపిస్తోంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ఉనాద్క‌ట్‌, ఇషాన్ మ‌లింగ‌ల‌తో కూడిన పేస్ త్ర‌యం ప్ర‌తీ ఓవ‌ర్‌కు స‌గ‌టున 11.47 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఈ లెక్క‌న ఇవాళ్టి మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోమారు చెల‌రేగితే మాత్రం ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు మూడిన‌ట్లేన‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 

మొత్తంగా చూసుకుంటే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ అంటేనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల బౌల‌ర్లు హ‌డ‌లెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ. ఇక ఐపీఎల్‌లో ఇరుజ‌ట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరుజ‌ట్లు 21 సార్లు త‌ల‌పడితే ఎస్ఆర్‌హెచ్ 12 సార్లు, రాజ‌స్తాన్ 9 సార్లు విజ‌యాలు అందుకున్నాయి. 

సీజన్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్‌ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement