‘త‌ప్పు చేశావ్‌.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’ | Rahane Mistake Choosing Batting Instead Of Bowling Vs Punjab Match | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘త‌ప్పు చేశావ్‌.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’

Apr 7 2026 10:53 AM | Updated on Apr 7 2026 11:08 AM

Rahane Mistake Choosing Batting Instead Of Bowling Vs Punjab Match

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మిపాలైన కేకేఆర్ పంజాబ్ కింగ్స్‌తో పోరులో ఎలాగైనా గెలిచి ఖాతా తెర‌వాల‌ని భావించింది. కానీ వ‌రుణుడి అడ్డంకితో మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. దీంతో పాయింట్ల ఖాతా తెరిచిన‌ప్ప‌టికీ విజ‌యం మాత్రం ఇంకా ద‌రిచేర‌లేదు. 

అయితే తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ర‌హానే బౌలింగ్‌కు బ‌దులు బ్యాటింగ్ తీసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా తాను టాస్ గెలిచి ఉంటే బౌలింగ్‌కు మొగ్గు చూపేవాడిన‌ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ పేర్కొన‌డంతో ర‌హానేపై విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. ఇదే విష‌య‌మై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్‌ఫించ్ సైతం ర‌హానే నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టాడు. 

ఫించ్ మాట్లాడుతూ.. ‘కేకేఆర్ కెప్టెన్ ర‌హానే తీసుకున్న నిర్ణ‌యం ఒక ర‌కంగా అర్థం లేనిది. మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంద‌న్న సంగ‌తి ర‌హానేకు ముందే తెలుసు. పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచడం, వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ర‌హానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డంలో అర్థం లేదు. ర‌హానే చేసింది ఎంత పెద్ద త‌ప్పు అనేది కాసప‌టికే కేకేఆర్‌కు తెలిసొచ్చింది. 

25 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. పిచ్‌పై ఉండే ప‌చ్చిక‌ను ఉప‌యోగించుకోవాల్సింది పోయి ర‌హానే గుడ్డిగా బ్యాటింగ్ ఎంచుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ర‌హానే ఇటీవ‌ల త‌న కెప్టెన్సీపై అసూయ ప‌డేవారు పెరిగిపోయార‌ని పేర్కొన్నాడు. కానీ ర‌హానే వ్యాఖ్య‌లు న‌న్ను నిరాశ‌ప‌రిచాయి. 

ఒక జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్న ఆట‌గాడికి ఏకాగ్ర‌త దెబ్బ‌తిన్న‌ప్పుడే ఇలాంటి పొర‌పాట్లు జ‌రుగుతాయి. మ‌న‌ల్ని విమ‌ర్శించివారిని తిరిగి దూషించ‌డం కెప్టెన్‌గా స‌రైన చ‌ర్య ఎంత‌మాత్రం కాదు. ర‌హానే నువ్వు చాలా మంచి ఆట‌గాడివి. ఓపెన‌ర్‌గా కొన‌సాగిస్తున్న దూకుడు అలాగే కొన‌సాగాలని కోరుకుంటున్నా. 

తొలి మ్యాచ్‌లో 220 ప‌రుగులు చేసి కూడా ఓట‌మి పాల‌వ్వ‌డం, రెండో మ్యాచ్‌లో ఛేద‌న‌లో చ‌తికిల‌ప‌డ‌డం చూస్తుంటే జ‌ట్టులో స‌మ‌తుల్యం దెబ్బ‌తిన్న‌ట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆట‌తో పాటు నాయ‌క‌త్వంపై కూడా దృష్టి పెడితే బాగుంటుంది’ అని పించ్ పేర్కొన్నాడు.

చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement