
బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం
‘టైబ్రేక్’లో నెగ్గిన హరియాణా స్టీలర్స్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 45–36 తో బెంగాల్ వారియర్స్ జట్టుపై నెగ్గింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లామ్ ఇనామ్‌దార్, రెయిడర్ ఆదిత్య షిండే పుణేరి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు చెరో 11 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ మోహితే, విశాల్ చెరో 5 పాయింట్లు సాధించారు.
తొలి అర్ధభాగం ముగిసేసరికి పుణేరి 26–22తో స్వల్పంగా ముందంజలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ పల్టన్ తమ జోరును కొనసాగించింది. రెండో ‘ఆలౌట్’తో ఆ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. బెంగాల్ తరఫున కెపె్టన్ దేవాంక్ ఒక్కడే 17 పాయింట్లు స్కోరు చేసినా లాభం లేకపోయింది. హరియాణా స్టీలర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ ముందు ‘టై’గా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 36–36 పాయింట్లతో సమంగా నిలిచాయి.
హరియాణా ఆటగాళ్లలో నవీన్ కుమార్ 9, వినయ్ 8 పాయింట్లు సాధించగా...ముంబా జట్టు తరఫున అజిత్ చౌహాన్ ఒక్కడే 12 పాయింట్లు సాధించడం విశేషం. అయితే చివరకు ‘టైబ్రైక్’లో హరియాణాను విజయం వరించింది. ఇందులో హరియాణా 7–6తో ముంబాపై పైచేయి సాధించింది. నేడు జరిగే మ్యాచ్ ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్... పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.