నేడు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఫైనల్
సా. గం. 6:30 నుంచి సోనీ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నీ తుది పోరుకు చేరింది. నాలుగో సీజన్ విజేత ఎవరో నేడు తేలనుంది. ముంబై మిటియోస్, బెంగళూరు టార్పెడోస్‌ల మధ్య ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టైటిల్ పోరు జరుగనుంది. ఈ లీగ్ ఆరంభం నుంచి ఇరు జట్లు కూడా నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టాయి. లీగ్ దశలో ముంబై ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.
టార్పెడోస్ ఒక్క మ్యాచ్ తక్కువగా గెలిచిందంతే! ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట విజయం సాధించింది. ఇప్పుడు ఈ టాప్–2 జట్లే అమీతుమీకి సిద్ధమవడంతో నేటి ఫైనల్ తుదికంటా ఆసక్తి రేపడం ఖాయం. బెంగళూరుకిది రెండో ఫైనల్. 2023లో తుది పోరుకు చేరినప్పటికీ... అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండేళ్ల క్రితం చేజారిన టైటిల్‌ను ఈసారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఆటగాళ్లున్నారు.
లీగ్ టాపర్ ముంబై మిటియోస్‌కిది తొలి ఫైనల్ కాగా... ఆఖరి పోరులోనూ గెలిచి విజయవంతంగా సీజన్‌ను ముగించాలని ఆశిస్తోంది. మిటియోస్ కెప్టెన్ అమిత్ గులియా ఎప్పటిలాగే సమష్టి ప్రదర్శనపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆరంభం నుంచే మ్యాచ్‌లో పట్టు బిగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని చెప్పాడు. మరోవైపు బెంగళూరు సారథి మ్యాట్ వెస్ట్ మాట్లాడుతూ ముంబైలాంటి గట్టి జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటమే తమకు కలిసొచ్చే అంశమని చెప్పాడు.


