
నవంబర్ 7 నుంచి 15 వరకు ఖజకిస్తాన్‌లో జరగనున్న జూనియర్ వరల్డ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ యువకుడు ప్రణవ్ మాదవ్ సురపనేని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISAI) అధికారికంగా ప్రకటించింది. ISAI అధ్యక్షుడు అమితాబ్ శర్మ ఓ లేఖ ద్వారా ప్రణవ్ ఎంపికను ధృవీకరించారు.
ఆ లేఖలో అమితాబ్ ప్రణవ్ ఇటీవలి ప్రదర్శనలను కొనియాడాడు. ప్రణవ్ వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హతకు అవసరమైన టైమింగ్‌ను క్లాక్ చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. తెలంగాణ నుంచి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక అథ్లెట్ ప్రణవ్ అని తెలిపారు.

ప్రణవ్ ఎంపికను పురస్కరించుకుని, అతనికి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని కోరారు. వింటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను పెంపొందించడంలో మీ సహకారం అమూల్యమైందని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రణవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.