
ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన పెంటాల ఆర్నవ్ రెడ్డి సత్తా చాటాడు. కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమయ్యాడు. డెహ్రాడూన్‌లోని హిమాద్రి ఐస్ రింక్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లో.. 333 మీటర్ రేసులో ఆర్నవ్ మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో స్పీడ్ స్కేటింగ్‌లో భారత అథ్లెటిక్ విభాగం సాధిస్తున్న పురోగతిలో తానూ భాగమయ్యాడు.
తెలంగాణకు చెందిన ఆర్నవ్ రెడ్డి అత్తాపూర్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. డీపీఎస్ ఏరోసిటీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆర్నవ్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో కోచ్‌లు ఎంఏ ఖాదీర్, సయ్యద్ ఎహ్‌సాన్ అహ్మద్, సయ్యద్ సఫీ హుసైనీ పాత్ర కీలకం. ఇక ఆర్నవ్ తల్లిదండ్రులు పెంటాల తిరుపతి రెడ్డి, స్మిత. ఎల్లవేళలా కుమారుడి వెన్నంటి ప్రోత్సహించే తిరుపతిరెడ్డి దంపతులు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆగష్టు 20- 23 వరకు ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ జరిగింది.