నేటి నుంచి పీకేఎల్ ఆఖరి అంకం
‘ప్లే ఇన్స్’లో నేడు హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ‘ఢీ’
యు ముంబాతో పట్నా పైరేట్స్ పోరు
గెలిచిన జట్లే ముందుకు
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా క్రీడాభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. హోరాహోరీ సమరాలు... ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో సాగిన లీగ్ దశ ముగియగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడగా... అందులో పాయింట్ల పట్టికలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. గతం కంటే భిన్నంగా జరుగుతున్న ఈ సీజన్‌లో నేటి నుంచి మరింత రసవత్తర మ్యాచ్‌లు జరగనున్నాయి.
లీగ్ దశలో జరిగిన 108 మ్యాచ్‌లను దేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహించగా... ఇప్పుడు ఆఖరి అంకం ఢిల్లీలో సాగనుంది. ప్లే ఆఫ్స్ ప్రారంభానికి ముందు ట్రోఫీ కోసం పోటీపడుతున్న 8 జట్ల కెప్టెన్‌లతో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ఈ సీజన్ చాలా హోరాహోరీగా సాగింది. లీగ్ దశలో జరిగిన మొత్తం 108 మ్యాచ్‌ల్లో 48 మ్యాచ్‌లు కేవలం 5 పాయింట్ల తేడాతో ఫలితం తేలాయి. 27 మ్యాచ్‌ల్లో చివరి 90 సెకన్లలో ఫలితాలు తారుమారయ్యాయి.
సీజన్ మొత్తం దాదాపు అన్ని రోజులూ రెయిడర్లు ‘సూపర్–10’లు సాధించారు. ఇక చివరి దశకు సమయం ఆసన్నమైంది. ఈ వారం మరింత ఉత్కంఠగా ఉండబోనుంది’ అని పీకేఎల్ చైర్మన్ అనుపమ్ గోస్వామి అన్నారు. ఈ సీజన్‌తోనే పీకేఎల్‌లో ‘టై బ్రేకర్’ విధానాన్ని ప్రవేశ పెట్టగా... మరింత పోటీతత్వం కనిపించింది. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు అన్నీ జట్లు హోరాహోరీగా పోరాడగా... లీగ్ దశలో అది్వతీయ ప్రదర్శన కనబర్చిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ చెరో 26 పాయింట్లతో పట్టిక తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి.
లీగ్ ప్రారంభమైన నెలన్నర వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పట్నా పైరేట్స్... ఆ తర్వాత విజృంభించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి ఏడో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టింది. ‘ఒత్తిడిలో జట్టును ఎలా నడిపించాలో నేర్చుకున్నాను. ఆ పాఠాలు ఇప్పుడు కెప్టెన్‌గా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఈ దశకు చేరుకోవడానికి జట్టుగా మేము ఎంతో కష్టపడ్డాం. అదే క్రమశిక్షణను ప్లే ఆఫ్స్‌లో కూడా కనబరుస్తాం’ అని పుణేరి పల్టన్ కెపె్టన్ అస్లమ్ ఇమాన్‌దార్ అన్నాడు.
‘ప్లే ఆఫ్స్‌లో ప్రతి పాయింట్ కీలకమే. ఒక్క రెయిడ్‌తో మ్యాచ్ మొత్తం మారిపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటమే నా బలం. దూకుడు మన దృష్టిని మరల్చుతుంది. ఒత్తిడి పెరుగుతున్నప్పుడు నన్ను నేను నియంత్రించుకుంటా. సీజన్ మొత్తం గొప్పగా పోరాడాం.
ప్లే ఆఫ్స్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని దబంగ్ ఢిల్లీ సారథి అశు మలిక్ వెల్లడించాడు. గతంతో పోలిస్తే కాస్త సంక్లిష్టంగా ఉన్న ప్లే ఆఫ్స్ విధానంలో... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరేందుకు సులువైన అవకాశం ఉండగా... మిగిలిన జట్లు తుదిపోరుకు అర్హత సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
పీకేఎల్ 12వ సీజన్‌ప్లే ఆఫ్స్‌ను ఓసారి పరిశీలిస్తే..
» శనివారం జరగనున్న తొలి ‘ప్లే ఇన్’ పోరులో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుంది. రెండో ‘ప్లే ఇన్’ మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా పైరేట్స్ ఆడుతుంది.
» ‘ప్లే ఇన్స్’లో గెలిచిన జట్లు... ఆదివారం జరగనున్న ఎలిమినేటర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అదే రోజు మినీ క్వాలిఫయర్‌లో భాగంగా... పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
» బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిన జట్టు... ఎలిమినేటర్–1 విజేతతో సోమవారం ఎలిమినేటర్–2 మ్యాచ్ ఆడనుంది.
» ఎలిమినేటర్–2లో గెలిచిన జట్టు... బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్ విజేతతో మంగళవారం ఎలిమినేటర్–3 ఆడనుంది.
» పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య సోమవారం క్వాలిఫయర్–1 జరగనుంది.
» క్వాలిఫయర్–1లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉంది.
» మంగళవారం జరిగే ఎలిమినేటర్–3లో గెలిచిన జట్టు... క్వాలిఫయర్–1లో ఓడిన టీమ్‌తో బుధవారం క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
» శుక్రవారం జరిగే ఫైనల్లో క్వాలిఫయర్–1, క్వాలిఫయర్–2 విజేతల మధ్య ట్రోఫీ కోసం ఫైనల్ ఫైట్ జరగనుంది.


