ఆసీస్ 191 ఆలౌట్‌, అశ్విన్‌ సక్సెస్‌

Pink Ball Test Day 2: Australia All Out For 191 - Sakshi

టీమిండియా బౌలర్ల జోరు, ఆసీస్‌ బేజారు!

అడిలైడ్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య పింక్‌ బాల్‌తో జరగుతున్న తొలి టెస్టులో కోహ్లి సేన మెరుగైన స్థానంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన టీమిండియా ప్రత్యర్థి జట్టును 191 పరుగులకు కట్టడి చేసింది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రాకు తోడు అశ్విన్‌ రెచ్చిపోవడంతో ఆథిత్య జట్టు బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తారు. 16.1 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చిన ఉమేశ్‌ 3 వికెట్లు, 21 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 18  ఓవర్లు బౌలింగ్‌ చేసి 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. షమీకి వికెట్లేమీ దక్కలేదు. రెండో రోజు మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్‌ కావడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.
(చదవండి: కోహ్లి సూపర్‌ క్యాచ్‌.. కష్టాల్లో ఆసీస్‌)

పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ భారత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా.. షా మరోసారి విఫలమయ్యాడు. 4 పరుగులు మాత్రమే చేసిన షా కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మయాంక్‌ అగర్వాల్‌ (5), నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన బుమ్రా (0) క్రీజులో ఉన్నారు. చివరి సెషన్‌ పూర్తవడంతో  రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లు ఆడిన భారత జట్టు 9 పరుగులకు ఒక వికెట్‌ కోల్పోయింది. కోహ్లిసేన‌ ప్రస్తుతం 62 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక పృథ్వీ షా తొలి ఇన్నింగ్స్‌ మాదిరే వికెట్‌ సమర్పించుకోవడంతో సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు మొదలయ్యాయి. ప్రాక్టీస్‌ మ్యాచుల్లో రాణించిన రిషభ్‌ పంత్‌ను కాదని అవకాశమిస్తే ఇలాగేనా ఆడేదని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రెండు ప్రాక్టీస్‌ మ్యాచుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో షా 0, 19, 40, 3 పరుగులు మాత్రమే చేసి విఫలమవడమే దీనికి కారణం. 'నీకు అవకాశాలు దండగ.. పోయి ఇంట్లో కూర్చో' అంటూ షాను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top