
27 ఏళ్ల శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ పథుమ్ నిస్సంక ప్రపంచ క్రికెట్‌లో మరో బ్యాటింగ్ స్టార్‌గా రూపాంతరం చెందుతున్నాడు. ఇతగాడు ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, నయా ఫ్యాబ్ ఫోర్‌లో ఒకడిగా ఉండేందుకు పూర్తి స్థాయి అర్హుడినంటూ సవాళ్లు విసురుతున్నాడు.
ఇప్పటివరకు 18 టెస్ట్‌లు, 71 వన్డేలు, 65 టీ20లు ఆడిన నిస్సంక.. టెస్ట్‌ల్లో 45 సగటున 4 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 1305 పరుగులు.. వన్డేల్లో 42 సగటున డబుల్ సెంచరీ, 7 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 2730 పరుగులు.. టీ20ల్లో 121.66 స్ట్రయిక్‌రేట్‌తో 14 అర్ద సెంచరీల సాయంతో 1854 పరుగులు చేసి అతి తక్కువ మంది ఆల్ ఫార్మాట్ బ్యాటర్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు.
నిస్సంక ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 76 పరుగులతో (92 బంతుల్లో 12 ఫోర్లు) రాణించిన అతను.. ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతమైన శతకంతో (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ తన జట్టును గెలుపు తీరాల వరకు చేర్చాడు.
నిస్సంక తాజా ప్రదర్శన తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానుల మధ్య నయా ఫ్యాబ్ ఫోర్‌పై చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ, రూట్, విలియమ్సన్, స్మిత్ ఫ్యాబ్ ఫోర్‌గా కీర్తించబడుతున్నారు. వీరి కెరీర్‌లు చరమాంకానికి ఉన్న దశలో, నయా ఫ్యాబ్ ఫోర్ ఎవరనే చర్చ జరుగుతుంది.
రేసులో చాలామంది యువ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ నయా ఫ్యాబ్ ఫోర్ రేసులో ముందున్నారు. వీరితో పాటు కెమరూన్ గ్రీన్, జేకబ్ బేతెల్ పేర్లు అడపాదడపా వినిపిస్తున్నా.. పోటీ మాత్రం గిల్, యశస్వి, బ్రూక్, రచిన్ మధ్యే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఫ్యాబ్ ఫోర్‌లో ఉండేందుకు తాను కూడా అర్హుడినేంటూ పథుమ్ నిస్సంక ముందుకొచ్చాడు. తన అసమాన ప్రతిభతో నయా ఫ్యాబ్ ఫోర్‌లో బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా మారాడు. ఫార్మాట్లకతీతంగా గణాంకాలు అతన్ని ప్రధాన పోటీదారుగా మారుస్తున్నాయి.
ఇదే ప్రదర్శనలను అతను మున్ముందు కూడా కొనసాగిస్తే, తప్పక నయా ఫ్యాబ్ ఫోర్‌లో ఒకడిగా కీర్తింబడతాడు. ప్రస్తుతానికైతే నిస్సంక నలుగురి మధ్య ఉన్న పోటీని ఐదుగురి మధ్యకు మార్చాడు.