ఏడు నెలల గర్భిణి.. అమ్మగా.. అథ్లెట్‌గా.. | Paralympics 2024: Jodie Grinham Para Archer Balances Motherhood Pregnancy, Check Out The Details | Sakshi
Sakshi News home page

Paralympics 2024: ఏడు నెలల గర్భిణి.. అమ్మగా.. అథ్లెట్‌గా..

Aug 31 2024 9:04 AM | Updated on Aug 31 2024 9:21 AM

Paralympics 2024: Jodie Grinham Para Archer Balances Motherhood Pregnancy

ఆమె ఒక అమ్మ. పైగా ఏడు నెలల గర్భవతి! అయితేనేం పారిస్‌లో ఆర్చర్‌గా పారాలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టింది. ఇంట్లో ఓ కంట రెండేళ్ల బాలుడి ఆలనాపాలన చూస్తోంది. మరో కంట రెండు నెలల్లో కళ్లు తెరిచే గర్భస్థ శిశువుని కనిపెడుతోంది. అలాగని రెండు పాత్రలతోనే సరిపెట్టుకోలేదు. ఆర్చరీలో లక్ష్యంపై బాణాలు కూడా సంధిస్తోంది.

వైకల్యాన్నే చిన్నబోయేలా చేసింది
అలా బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హమ్‌ త్రిపాత్రాభినయానికి సమన్యాయం చేస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఓపెన్‌ ఈవెంట్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో జోడీ గ్రిన్‌హమ్‌ 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 

అనంతరం బ్రిటన్‌ సహచరుడు నాథన్‌ మాక్‌క్విన్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఓపెన్‌ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఒకే రోజు ఓ గర్భిణి రెండు ఈవెంట్లతో పాల్గొని వైకల్యాన్నే చిన్నబోయేలా చేసింది.

అమ్మను.. పారా అథ్లెట్‌ను కూడా
పోటీల అనంతరం ఆమె మాట్లాడుతూ ‘నేను అమ్మను, అలాగే పారా అథ్లెట్‌ను. వీటిలో ఏ ఒక్కటి వదులుకోను. కానీ... ఇంట్లో మాత్రం వందశాతం అమ్మనే’ అని అమ్మతనాన్ని, అథ్లెట్‌ సామర్థ్యాన్ని వివరించింది. ‘నేను ఇంకా బాగా రాణించగలనని నాకు తెలుసు. ఇంకాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది. 

అయినా నాలుగో స్థానమేమి నిరాశపర్చలేదు. మిగతా ఈవెంట్లపై మరింత దృష్టి సారించేలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది’ అని తెలిపింది. జోడీ గ్రిన్‌హమ్‌కు ఇదేం తొలి పారాలింపిక్స్‌ కాదు. రియో పారాలింపిక్స్‌ (2016)లో పాల్గొని మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో రజతం నెగ్గింది. ఇక ఈ పారాలింపిక్స్‌లో ఆమె శని, సోమవారాల్లో పతకాల కోసం రెండు ఈవెంట్‌లలో పాల్గొనాల్సి ఉంది.

చదవండి: అవని అద్వితీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement