
3–2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్‌పై విజయం
సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్
జొహర్ బహ్రు (మలేసియా): భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్‌లో శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోరులో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్‌ను చిత్తుచేసింది. కెప్టెన్ రోహిత్ (45వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో విజృంభించగా... రణ్‌వీత్ సింగ్ (23వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు. గ్రేట్ బ్రిటన్ తరఫున మైఖేల్ రొయ్‌డెన్ (26వ నిమిషంలో), కాడెన్ డ్రాసే (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో భారత జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా... దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16వ నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కూడా గోల్‌గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో గుర్‌జ్యోత్ సింగ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని రణ్‌వీత్‌కు అందించగా... అతడు దాన్ని గోల్‌పోస్ట్‌లోకి పంపి భారత్‌కు మొదటి గోల్ అందించాడు.
కాసేపటికే ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా... మూడో క్వార్టర్‌లోనూ ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 45వ నిమిషంలో బ్రిటన్ స్ట్రయికర్లు చేసిన ప్రయత్నాల్ని భారత గోల్‌కీపర్ ప్రిన్స్‌దీప్ సింగ్ సమర్థవంతంగా అడుకున్నాడు. అదే సమయంలో రోహిత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం రెట్టింపు కాగా... తర్వాతి నిమిషంలోనే పెనాల్టీ స్ట్రోక్‌ను వినియోగించుకున్న గ్రేట్ బ్రిటన్ స్కోరును మరోసారి సమం చేసింది.
ఇక చివరి క్వార్టర్‌లో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కించుకున్న భారత్... మూడోదాన్ని గోల్‌గా మలచి విజయంతో మ్యాచ్‌ను ముగించింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.