భారత బౌలర్లపై పాక్‌ బ్యాటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Pakistan Batter Sparks Controversy With Hate Comment On Indian Bowlers | Sakshi
Sakshi News home page

భారత బౌలర్లపై పాక్‌ బ్యాటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 27 2026 8:23 PM | Updated on Apr 27 2026 10:13 PM

Pakistan Batter Sparks Controversy With Hate Comment On Indian Bowlers

పాక్‌ క్రికెటర్లకు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో ఈ తంతు మరీ ఎక్కువైంది. కొందరు ప్రస్తుత ఆటగాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.

తాజాగా ఆ జట్టు టాపార్డర్‌ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌ భారత బౌలర్లపై తనకెప్పుడూ ఆగ్రహంగా ఉంటుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్‌కు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఏ బౌలర్ అయినా లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ఎవరిపైనైనా దాడి చేస్తామని అన్నాడు.

భారత్ గురించి అడిగినప్పుడు అతని సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. "భారత్ అనగానే, ప్రతి బౌలర్‌ను తప్పకుండా టార్గెట్ చేయాలనిపిస్తుంది. వారి ప్రతి బౌలర్‌పై మాకు ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. వారిని బలంగా ఎదుర్కోవాలనుకుంటాం" అని అన్నాడు.

క్రీడల్లో ప్రత్యర్థిపై గెలవాలనే తపన సహజం. అయితే "ద్వేషం" వంటి పదాల వాడకం అనవసర వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ లాంటి సున్నిత సందర్భాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది.

హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్‌పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్‌ 2025లో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్‌ యాదవ్‌ అతని వికెట్‌ను పడగొట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో హసన్‌ మంచి ఫామ్‌లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున పది మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement