టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్.. వన్డే వరల్డ్‌కప్-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.
టైటిల్ గెలిచిన తర్వాత వేటు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్‌లోనే హిట్‌మ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.
ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.
ఫిట్‌నెస్ సమస్యలు
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్‌లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్‌కు లోబడి ఈ సిరీస్‌లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.
బాగా సన్నబడ్డాడు.. కానీ
రోహిత్ భవిష్యత్ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు గత మూడు వారాల్లో రోహిత్ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్‌కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.
జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మాదిరి వన్డే క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.
రోహిత్‌కు బై.. బై!.. జైసూకు లైన్ క్లియర్!
నిజానికి వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.
అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్‌మన్ గిల్ లేదంటే యశస్వి జైస్వాల్ గాయపడినా మరో బ్యాకప్ ఓపెనర్‌ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది.
అగార్కర్ సంకేతాలు
కాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ- ప్రస్తుత సారథి శుబ్‌మన్ గిల్ భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ కంటే ముందు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్‌కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


