భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై ప్లేయర్ సాంట్నర్ భుజానికి గాయమైంది.
ఆ మ్యాచ్ నుంచి మధ్యలోనే తప్పుకున్న అతను లీగ్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అతను నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవలే స్వదేశానికి చేరుకున్న సాంట్నర్‌కు పరీక్షలు నిర్వహించిన క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) అతని గాయం విషయంపై స్పష్టమైన ప్రకటన ఇచ్చింది.
‘శుక్రవారం ఉదయమే ప్రత్యేక వైద్య నిపుణుడిని సాంట్నర్ కలిశాడు. గాయం నుంచి కోలుకునే క్రమంలో తగినంత విశ్రాంతితో పాటు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వారు తేల్చారు’ అని ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. తాజా పరిణామాల కారణంగా ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టుతో పాటు లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు నుంచి అతను తప్పుకోవడం ఖాయమైంది.
గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే సాంట్నర్‌ను ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఆడించాలా లేదా అనేదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. 2026 టి20 ప్రపంచకప్‌లో సాంట్నర్ సారథ్యంలోనే కివీస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!


