అన్నా.. సారీ.. నిన్ను త‌క్కువ‌గా అంచ‌నా వేశాం! | Riyan Parag Brilliant 90 Goes In Vain As Rajasthan Royals Lose To Delhi Capitals Despite Massive Total In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను త‌క్కువ‌గా అంచ‌నా వేశాం!

May 2 2026 7:18 AM | Updated on May 2 2026 11:33 AM

Fans Hail Riyan Parag For Fiery Knock Vs Capitals In IPL 2026

ఐపీఎల్‌-2026లో జైపూర్ వేదికగా ఢిల్లీ ​క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైనప్పటికి, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత కొన్ని మ్యాచ్‌లగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన రియాన్‌.. ఢిల్లీపై మాత్రం వీరవిహారం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

స్టార్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైశ్వాల్ వికెట్లను రాజస్తాన్‌ తొలి రెండు ఓవర్లలోనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పరాగ్ బాధ్యయతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన పరాగ్‌, క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు.  తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానమిచ్చాడు. ఈ అస్సాం క్రికెటర్ కేవలం 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి తృటిలో తన తొలి ఐపీఎల్ సెంచరీని కోల్పోయాడు. అతడితో పాటు ఆఖరిలో (14 బంతుల్లోనే 6 సిక్సర్లతో 47*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసర బ్యాటింగ్ చేసిన పరాగ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నా నిన్ను తక్కువగా అంచనా వేసినందుకు మమ్మల్ని క్షమించు అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. కాగా రియాన్ గత వారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో  'వేపింగ్' చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా బీసీసీఐ విధించింది.

అనంతరం పరాగ్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇన్నింగ్స్‌తో విమర్శించిన నోళ్లే అతడిని ప్రశంసిస్తున్నాయి. ఇక రాజస్తాన్ నిర్ధేశించిన ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీ విజయంలో కేఎల్ రాహుల్‌(75), నిస్సాంక(62) కీలక పాత్ర పోషించారు.
చదవండి: అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement