
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ పేరును తాజాగా వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) అందరి కంటే భిన్నమైన ఆటగాడు అని చెప్పిన షాహిన్.. అతడి కంటే ఓ సౌతాఫ్రికా బ్యాటర్‌కు బౌల్ చేయడం అత్యంత కష్టమని చెప్పాడు.
అనతికాలంలోనే కీలక బౌలర్‌గా
కాగా టీనేజీలోనే పాకిస్తాన్ తరఫున షాహిన్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2018లో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు పాక్ తరఫున 84 టీ20లు, 66 వన్డేలు, 31 టెస్టులు ఆడిన షాహిన్ ఆఫ్రిది.. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 107, 131, 116 వికెట్లు కూల్చాడు.
ఏడేళ్ల కెరీర్‌లో షాహిన్ ఆఫ్రిది ఎంతో మంది మేటి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. అయితే, ఈ లెఫ్టార్మ్ పేసర్ కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మాత్రమే టీమిండియా ఆటగాళ్లకు బౌల్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ ఎవరన్న విషయంలో విరాట్ కోహ్లిని కాదని సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లాకు ఓటేశాడు.
టెస్టులలో ఒక్కసారి కూడా..
సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి హషీమ్ ఆమ్లా 18672 పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ మాజీ క్రికెటర్‌ను టెస్టుల్లో అవుట్ చేయడంలో పాతికేళ్ల షాహిన్ ఆఫ్రిది ఒక్కసారి కూడా సఫలం కాలేదు. అతడికి 31 పరుగులు సమర్పించుకున్నాడు.

అదే విధంగా.. వన్డేల్లో హషీమ్ ఆమ్లాను రెండుసార్లు అవుట్ చేయగలిగిన షాహిన్ ఆఫ్రిది.. 40 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పాక్ పేసర్‌కు.. మీ కెరీర్‌లో ఇంత వరకు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.
కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడే
ఇందుకు బదులిస్తూ.. ‘‘వన్డేల్లో, టెస్టుల్లో ఆయనతో మ్యాచ్‌లు ఆడాను. ఇంగ్లండ్ టీ20 టోర్నీ విటలిటి బ్లాస్ట్‌లో కూడా ఆయనతో పోటీపడ్డాను. ఆయనొక గొప్ప బ్యాటర్. తన ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు.
అందుకే హషీం ఆమ్లానే నాకు కఠినమైన సవాలు విసిరిన బ్యాటర్ అని చెప్పగలను. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. అతడొక భిన్నమైన ప్లేయర్. అయితే, నా వరకు మాత్రం హషీమ్ భాయ్ మాత్రం అందరికంటే టఫెస్ట్ బ్యాటర్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం యూఏఈ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న షాహిన్.. తదుపరి ఆసియా కప్ టీ20-2025 టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబరు 9 -28 వరకు జరిగే ఈ ఈవెంట్‌కు యూఏఈ వేదిక.
చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన