
రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
ఓపెనర్ పథుమ్ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
లియనాగే, మెండిస్ ఆరో వికెట్‌కు 83 బంతుల్లో 137 పరుగులు జోడించి, స్కోర్‌ను 300 పరుగుల సమీపానికి చేర్చారు. ఇన్నింగ్స్ చివరి బంతికి కమిందు ఔట్ కాకపోయుంటే స్కోర్ 300 దాటేదే.
ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. 13 బంతులు ఆడిన ఓపెనర్ నిషాన్ మధుష్క డకౌటయ్యాడు. ఆతర్వాత నిస్సంక.. కుసాల్ మెండిస్ (38), సదీర సమరవిక్రమతో (35) ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుసాల్‌తో 100 పరుగులు, సమరవిక్రమతో 30 పరుగులు జోడించాడు.
అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఆఖర్లో కమిందు, లియనాగే చెలరేగి భారీ స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 2 వికెట్లు తీయగా.. బ్లెస్సింగ్ ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, సికందర్ రజా, సీన్ విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, శ్రీలంక జట్టు 2 మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో రెండో వన్డే ఆగస్ట్ 31న, మూడు టీ20లు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరుగనున్నాయి.
ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు ఈ సిరీస్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఈ సిరీస్ పూర్తైన వెంటనే శ్రీలంక నేరుగా యూఏఈకి వెళ్లనుంది.
జింబాబ్వే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్.. మ్యాచ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే గాయంతో వైదొలిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కూడా గాయం కారణంగానే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఎర్విన్ స్థానంలో వన్డే సిరీస్‌లో సీన్ విలియమ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.