వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ (3-0) చేసింది. ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో కేవలం 222 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ జట్టు టాపర్డర్ విఫలమైనప్పటికి.. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఓవర్టన్ 62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు సాధించారు. అతడితో పాటు జోస్ బట్లర్(38), బ్రైడన్ కార్స్(36) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. జాకబ్ డఫీ మూడు, జకారీ ఫౌల్క్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

తడబడి నిలబడి..
అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో న్యూజిలాండ్ కూడా కాస్త తడబడింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (46), డెవాన్ కాన్వే (34) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. దీంతో బ్లాక్ క్యాప్స్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కివీస్ 118 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. అయితే టెయిలెండర్లు జాకరీ ఫోల్క్స్ (14 నాటౌట్), బ్లెయిర్ టిక్నర్ (18 నాటౌట్) ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, ఓవర్టన్ తలా రెండు వికెట్లు సాధించారు.
కాగా వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ జట్టు వైట్ వాష్ చేయడం 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
చదవండి: IND vs SA: రసవత్తరంగా మ్యాచ్.. లక్ష్య ఛేదనలో భారత్‌కు భారీ షాక్


