పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గులేదా’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్, భారత్‌పై పడి ఏడ్వటం మానేసి పాకిస్తాన్ సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను అదే స్థాయిలో ప్రమోట్ చేయాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే ఈ లీగ్‌ను నిర్వహిస్తుండగా.. ప్రసార హక్కుల విషయంలో ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
నాలుగు సీజన్లకు సమానం
ఐపీఎల్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్‌ఎల్ నాలుగు సీజన్లకు సమానంగా ఉంటుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్‌తో పోలుస్తూ పాక్ మాజీ క్రికెటర్లు, పీసీబీ చీఫ్ నఖ్వీ పీఎస్‌ఎల్‌ను పొగుడుకుంటూ ఉంటారు.
ఇక తాజా సీజన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో పాక్‌లో చమురు సంక్షోభం తలెత్తగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే కేవలం కరాచీ, లాహోర్‌లో మాత్రమే పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఐపీఎల్ అన్ని వేదికల్లోనూ సజావుగా మ్యాచ్‌లు సాగుతుండగా.. ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు.
అర్థం చేసుకోవాలి
ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియానికి ఎప్పుడు అనుమతిస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మొహ్సిన్ నఖ్వీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ‘‘ఈరోజే నేను పీఎస్‌ఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లతో మాట్లాడాను.
కరాచీ కింగ్స్ కూడా ఈ విషయం గురించి మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. నేను ప్రధానిని కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరతాను. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.
అంతటా ఇంధన సంక్షోభం ముదిరింది. ఓవైపు మా ప్రధాని మాత్రం ఇరాన్- అమెరికా యుద్ధానికి చరమగీతం పాడి శాంతివైపు మొగ్గుచూపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.
ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది
మా ప్రధాని అదే పనిమీద ఉన్నారు. ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ చమురు సంక్షోభం ఎక్కువైంది. పెట్రోల్ పంపుల్లో బారులు తీసిన వాహనాలను చూస్తుంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు’’ అని నఖ్వీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు.
‘‘అవును.. పాకిస్తాన్‌లో అసలు ఎలాంటి సంక్షోభం లేదు. ఇండియాలో అయితే నేను ఈరోజు సాయంత్రం.. 45 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద సంక్షోభమో’’ అంటూ నఖ్వీకి కౌంటర్లు ఇస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
చదవండి: ఐసీసీ చైర్మన్‌గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటన
Pakistan's effort is to establish peace. There is a petrol shortage in India, whereas there is no such issue in Pakistan. I will request the Prime Minister to allow spectators to attend the PSL matches." Mohsin Naqvi Chairman PCB#Pakistán #Cricket #PakistanShapesPeace #india pic.twitter.com/oxEJV9MvLY
— Ali Hasan 🏅 (@AaliHasan10) April 13, 2026


