
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం సీనియర్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో నీరూ ధండ రెండు బంగారు పతకాలతో అదరగొట్టింది. ఆరుగురు పోటీపడ్డ మహిళల ట్రాప్ ఫైనల్లో భారత షూటర్ నీరూ ధండ 43 పాయింట్లు స్కోరు చేసి చాంపియన్‌గా అవతరించింది. భారత్‌కే చెందిన ఆషిమా అహ్లావత్ 29 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సంపాదించింది. నీరూ, ఆషిమా, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 319 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్‌లో భౌనీశ్ మెండిరట్టా రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో భౌనీశ్ 45 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఇషా బృందానికి కాంస్యం
మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. ఇషా సింగ్, మనూ భాకర్, సిమ్రన్‌ప్రీత్ కౌర్ బృందం 1749 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 25 మీటర్ల వ్యక్తిగత విభాగం ఫైనల్లో మనూ భాకర్ 25 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇషా సింగ్ 18 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి పతకాలకు దూరమయ్యారు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేశారు. పాయల్ స్వర్ణం, నామ్యా కపూర్ రజతం, తేజస్విని కాంస్యం గెలిచారు. ప్రస్తుతం భారత్ 29 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 54 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.