
రెండు స్వర్ణాలతో సిఫ్ట్ కౌర్, అనుష్క డబుల్ ధమాకా
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో ఒలింపియన్ సిఫ్ట్ కౌర్ సమ్రా వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాలు గెలుచుకుంది. ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 459.2 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
టీమ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా (589), ఆషి చౌక్సీ (586), అంజుమ్ మౌద్గిల్ (578)లతో కూడిన భారత బృందం మొత్తం 1753 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన శ్రీయాంక సదండి ‘టాప్’లో నిలిచింది. అయితే శ్రీయాంక ‘ర్యాంకింగ్ పాయింట్స్ ఓన్లీ’ (ఆర్‌పీఓ)లో పోటీపడటంతో పతకం బరిలో నిలిచే అవకాశం దక్కలేదు. ఆర్‌పీఓ షూటర్లకు మెడల్ రౌండ్ చాన్స్ ఉండదు.
జూనియర్ ఈవెంట్‌లో షూటర్ అనుష్క ఠాకూర్ పసిడిపై గురిపెట్టి తొలిసారి అంతర్జాతీయ పతకాలతో డబుల్ ధమాకా సాధించింది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో 18 ఏళ్ల అనుష్క 460.7 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. అనుష్క (583), ప్రాచీ గైక్వాడ్ (588), మహిత్ సంధూ (587) బృందం 1758 స్కోరుతో పసిడి పతకాన్ని గెల్చుకుంది.
జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో సమీర్ కాంస్యం నెగ్గాడు. ఫైనల్లో సమీర్ 21 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. సమీర్, సూరజ్ శర్మ, అభినవ్ కలిసి టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గారు. జూనియర్ మహిళల ట్రాప్ ఈవెంట్‌లో హరీస్ సబీరా స్వర్ణం, ఆద్య రజతం నెగ్గారు. టీమ్ ఈవెంట్‌లో సబీర–ఆద్య–భవ్యలతో కూడిన త్రయం కూడా బంగారు పతకం గెలిచింది. ఆర్యవంశ్–అర్జున్–ఉద్ధవ్‌లతో కూడిన జూనియర్ పురుషుల టీమ్ కూడా పసిడి పతకం నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 31 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 56 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతోంది.